Wednesday, July 22, 2009

పీఆర్పీ టీవీ త్వరలో? -PRP channel soon






కాంగ్రెస్ కి అండగా సాక్షి టీవీ,సాక్షి పేపరు,ఎన్ టీవీ ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటి వల్లే పార్టీ అధికారంలోకి రాగలగిందని పీఆర్పీ అంటోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంకు సపోర్టుగా ఈనాడు, ఆంద్రజ్యోతి, ఈటీవీ, స్టూడియో ఎన్,టీవీ ఫైవ్ వంటి ఛానెల్స్ అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈ పరిస్ధితుల్లో ప్రజారాజ్యానికి వత్తాసు పలికే మీడియా లేదని ఆ పార్టీ ముఖ్యనేతలు గగ్గోలు పెడుతున్నారు. ఎలక్షన్స్ లో ప్రజారాజ్యం ఘోర పరాజయానికి పార్టీ కి ప్రత్యేకమైన ఛానెల్ లేకపోవటమే కారణమని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

వైజాగ్ లో పార్టీ సమీక్షా సమావేశానికి వచ్చిన పరిశీలుకులు, ఆ పార్టీ ముఖ్య నేతలు మొత్తం మీడియా సరిగ్గా సహకరించకపోవటం వల్లే తమకీ స్ధితి వచ్చిందని వాపోయారు. ఉన్న ఒక్క మాటీవీ కూడా మాటవినే స్ధితిలో లేదని, న్యూస్ సైతం తీసేసిందని గోలపెడుతున్నారు. దాంతో ప్రజారాజ్యం పార్టీ ఒక సొంత టివి ఛానల్, పత్రికను ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఆ పార్టీ నాయకుల ప్రసంగాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

అలాగే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని తొక్కేయడానికి మీడియా యావత్తూ పనిచేసిందని వారు అంటున్నారు. ఎన్నికల్లో పరజాయంపాలైన తరువాత కూడా పిఆర్పీ ఖాళీ అయిపోతోందన్న కథనాలు ఆ ఛానెల్స్,పేపర్లులలో వస్తున్నాయన్నారు. ఇక చిరంజీవికి అత్యంత సన్నిహితంగా మెలికే కాకినాడ ఎమ్మెల్యే కన్నబాబు కూడా ఈ అంశాలను పదేపదే ప్రస్తావించారు.

మీడియా దుష్ప్రచారం వలనే ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాలేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని అథిష్టానం తీవ్రంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ఒక సొంత ఛానల్, పత్రిక ఉంటే బాగుంటుందన్న నేతల అభిప్రాయాలకు అనుగుణంగానే అధిష్టానం నిర్ణయం తీసుకోనుందని ఆ పార్టీ అగ్రనేతలు అన్నారు. ఇవన్నీ చూస్తూంటే ప్రజారాజ్యం పవురు నిలబెట్టటానికి అల్లు అరవింద్ ప్రత్యేకమైన ఛానెల్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారా అనిపిస్తుంది. అయినా ఆయన ఛానెల్ పెడితే ఎంటర్టైన్మెంట్ కి మాత్రం లోటు ఉండదని అంటున్నారు.